Mohammed Shami: ప్రపంచ కప్ టోర్నీలో మహ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 మ్యాచులు ఆడిన షమీ.. 23 వికెట్లతో ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. సెమీ ఫైనల్ హీరో మహ్మద్ షమీకి మంచి కానుకగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. షమీ స్వగ్రామంలో క్రికెట్ మైదానాన్ని నిర్మించాలి అని అనుకుంటుంది. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని అలీనగర్ అనే మారుమూల గ్రామం షమీ పుట్టిన ఊరు. అలీనగర్‌లో మినీ స్టేడియంతో పాటు జిమ్‌ను నిర్మించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పని మొదలు పెట్టారు.
అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి, అధికారుల బృందంతో శుక్రవారం అలీనగర్ గ్రామంలో పర్యటించారు. అక్కడ క్రికెట్ మైదానాన్ని నిర్మించేందుకు అనువైన స్థలాన్ని గుర్తించారు. అలీ నగర్లో మినీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు అనువైన స్థలం చాలా ఉందని తెలిపిన కలెక్టర్ రాజేష్ త్యాగి.. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియంలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. క్రీడా మైదానాలను నిర్మింత తలపెట్టాల్సిన జిల్లాల్లో అమ్రోహా కూడా ఉంది. ఈ జిల్లా నుంచి స్టేడియంను నిర్మించేందుకు మహ్మద్ షమీ స్వగ్రామం అలీనగర్‌ను ఎంపిక చేశాం’ అని కలెక్టర్ రాజేష్ త్యాగి అన్నారు.
తొలి 4 మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన షమీ.. న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్లు తీసిన షమీ.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పడి లేచిన కెరటంలా విజృంభిస్తున్న షమీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ ఇదే దూకుడు కొనసాగించి, భారత్‌కు మూడో వరల్డ్ కప్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు.