Chandra Babu: తెలుగుదేశం అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతం లో విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. పార్టీ నాయకులు మరియు చంద్ర బాబు గారి కుటుంబ సభ్యులు రాజమండ్రి జైలు వద్దకు వచ్చి బాబు గారికి స్వాగతం పలికారు. తమ అధినేత విడుదల కావడంతో తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమండ్రి సిటి అంతా ట్రాఫిక్ తో స్థబించిపోయింది. తెలుగుదేశం కార్యకర్తలు మరియు నాయకులతో కేంద్ర కారాగారం వద్ద సందడి వాతావరం నెలకొంది.
కుటుంబ సభ్యులు నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాల్ష్, నందమూరి బాలకృష్ణ, తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్ తదితరులు జైలు వద్దకు వచ్చారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐనప్పటికి వాటిని తోసుకుంటూ జైలువద్దకు దూసుకొచ్చారు. దీంతో జైలు వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది. జైలు పరిసర ప్రాంతాలు అన్నీ జై చంద్రబాబు, జై చంద్రబాబు నినాదాలతో మారుమోగాయి.